Sunday, March 11, 2012

సినీ సరిగమలు - హంసధ్వని -hamsadhwani


రాగరంజని
                                           హంసధ్వని  
(ఆంధ్రభూమి దినపత్రిక, ఆంధ్రభూమి వారపత్రిక,ఆంధ్రజ్యోతి దినపత్రిక లలో  నేను నిర్వహిచిన సాంస్కృతిక పేజీలు 'రంజని'.'కళాజ్యోతి ' లలో ధారావాహికంగా ప్రచురింపబడ్డ వ్యాసాలు.ఈ వ్యాసం ప్రచురించిన మంగు రాజగోపాల్ ,నండూరి రామ మోహన రావు గారు,సహకారం అందించిన నా శ్రీమతి శ్రీ సుశీలకి కృతజ్ఞతలు )
     ప్రపంచ సంగీత సంప్రదాయాలన్నింటి లోనూ  భారతీయ సంగీతం చాలా విశిష్టమైంది.మనకున్న రాగసంపదే ఆ విశిష్టత  కి కారణం .మన సంగీతానికి ఆత్మ రాగాలే!
               మనకి కలిగే సంతోషం,దుఖం బాధ,జాలి,విచారం ఇలా అన్నిమూడ్స్ వ్యక్తం చేయడానికి మన సంగీతం లో రాగాలు ఉన్నాయి.మనం వినే ప్రతీ సంగీత ప్రక్రియ శాస్త్రీయ సంగీతం కానీ ,సినీమా పాట గానీ ఏదో ఒక రాగం పై ఆధారపడి వుంటుంది.`గురు లేక ఎటువంటి గుణికి తెలియగ బోదు 'అనే త్యాగరాజ కీర్తనకి,`ఎదుట నీవే !ఎదలోన నీవే ' అనే సినిమాపాటకి ఆధారం `గౌరీ మనోహరి'అనే సంప్రాదాయిక రాగం అంటే మనకి ఆశ్చర్యం గా వుంటుంది.అంతెందుకు `రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ రామ'అనే కీర్తన కీ` యమహా నగరి కలకత్తా పురీ'
అనే సినీమా పాటకీ ఆధారం `కదన కుతూహలం 'అనే రాగం ఆధారం.
                 ఇలా మనకి తెలిసిన ప్రతి సంప్రదాయిక సంగీత రచన,,సినిమా పాటా ఏదో ఒక రాగంపైన ఆధారపడి వుంటుంది.మనకి తెలియకుండానే ఎన్నో సంప్రదాయిక  రాగాలు మనకి కీర్తనల ద్వారా సినిమా  పాటల ద్వారా పరిచయమయ్యే వుంటాయి.
మ వాగ్గేయ కారులు,న చలన చిత్ర సంగీత దర్శకులు వారి మేధస్సుతో,సృజనాత్మకతని జోడించి  సంప్రదాయిక రాగాలలో ఎన్నో మంచి మంచి,కీర్తనలు పాటలు సృష్టించి సంప్రదాయిక రాగాల బహుముఖ సౌందర్యాలని ఆవిష్కరించారు.అంతే కాదు ఎన్నెన్నో ప్రయోగాలు  చేసి వాటికి  కొత్త రూపాలిచ్చారు.
         ఎక్కువ లోతులకి పోకుండా మన సంప్రదాయిక సంగీత రచనల్లో, సినిమా పాటలలో సంప్రదాయిక రాగాలగురించి చర్చించుకోవడమే  ఈ శీర్షిక లక్ష్యం.

                                                    హంసధ్వని 
మన  భారతీయ సంగీతంలో ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క స్వభావం వుంది .ఒక్కొక్క రాగం ఒక్కొక్క మూడ్ ని  సూచిస్తుంది .ఉదాహరణకి 'భూపాలం'ఉదయరాగం కావటంవల్ల సూర్యోదయాన్నిఆ రాగం సూచిస్తుంది .అలాగే హంసధ్వని   రాగం ప్రారంభాన్ని సూచిస్తుంది .రాగల స్వభావాలని ,మూడ్స్ ని బట్టి ఆయా రాగాలలో పాటలని స్వరపరచే ఆచారంమనకి అనాదిగా వస్తోంది .
             .దక్షిణాదిలోశాస్త్రీయ సంగీత కచేరీలని' హంసధ్వని'రాగంతో ప్రారంభించే   ఆచారం వుంది.      


(హంసధ్వని రాగం హిందుస్తానీ పధ్ధతి వాతాపిగణపతిం భజే హం కీర్తన)



                                   (హంసధ్వని రాగం హిందుస్తానీ పద్ధతిలో)
ఈ రాగం ఆధునిక రాగాలకోవకి చెందినది .ముత్తుస్వామి దీక్షి తార్'తండ్రి రామస్వామి ఈ రాగాన్ని సృష్టించారని  చెపుతారు .ప్రాచీన గ్రంధాలలో' హంసధ్వని ' రాగం గురించి ఎక్కడా ప్రస్తావించినట్టు  కనిపించదు.పర్షియా సంగీత సంప్రదాయానికి  చెందిన రాగాన్నిరామ స్వామి దీక్షితార్ అడాప్ట్ చేసుకుని దక్షిణాది సంగీత సంప్రదాయానికి చెందిన ఇడియంస్  ,ఫ్రేజెస్ తో కీర్తనలని పాడారని చెపుతారు. హిందుస్థానీ సంగీతంలో  హంసధ్వని ని పోలిన  రాగం లేదు.దక్షిణాది లో  పాడుతోన్న రాగాన్నే బండి బజార్  ఘరానా కి చెందిని ఉస్తాద్  అమన్ ఆలీఖాన్ ఉత్తరాది లో బాగా ప్రాచుర్యం లోకి తెచ్చారు                         .  
                         హంసధ్వని రాగం 29 వ మేళకర్త ధీర శంకరాభరణం జన్యం ఇది ఔఢవ -ఔఢవ జాతికి చెందినది అంటే ఈ రాగం ఆరోహణ లోను అవరోహణ లోనూ ఐదేసి స్వరాలుంటాయి.
ఆరోహణ: స-రి-గ-ప-ని-స (షడ్జమం-చతుసృతి రిషభం-అంతర గాంధారం-పంచమం-కైసికి నిషాదం-షడ్జమం)
అవరోహణ: స-ని-ప-గ-రి-స (షడ్జమం-చతుసృతి రిషభం-అంతర గాంధారం-పంచమం-కైసికి నిషాదం-షడ్జమం)
ఈ రాగం భక్తి భావాన్ని వ్యక్తీకరిస్తుంది.కానీ చలన చిత్రసంగీతం లో ప్రయోగాత్మకంగా,జావళీలు,సోలో లు, యుగళ గీతాలు కూడా స్వరపరచారు.
                   హంసధ్వని రాగం లో దీక్షితార్ కీర్తన` వాతాపి గణపతిం భజేహం '  'త్యాగరాజ కీర్తన `రఘునాయక నీ పాద యుగ  రాజీవము నే విడజాలానురా ',పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ కీర్తన వినాయకా నిను వినా బ్రోచుటకు'కూడా ప్రసిద్ధి చెందాయి.
 వాతాపి గణపతింభజే హం' కీర్తన జన సామాన్యంలోకి తీసుకు వెళ్ళిన ఘనత  ఘటసాలగారిదే! తేలికైన పద్ధతిలో అందరూ పాడుకునేలా ఎక్కువ సంగతులు లేకుండా పాడి ఈ కీర్తనని ఎంతగా పొపులర్ చేసారంటే ఇప్పటికీ ఏ కార్యం ప్రారంభించాలన్నా గణపతి ప్రార్ధనా శ్లోకం `శుక్లాంబరధరం విష్ణుం.....',`వాతాపిగణపతిం భజే' కీర్తనలతో ప్రారంభించడం ఒక సంప్రదాయమైపోయింది. 
ఈ కీర్తన ప్రభావం హిందీ చలన చిత్ర సంగీతం లో కూడాకనిపిస్తుందిప్రఖ్యాత సంగీత దర్శకుడు సలీల్ చౌధురీ వాతాపి కీర్తనని యదా తధంగా  అడాప్ట్ చేసుకుని  `పరిహార్ 'అనే చిత్రం లో `జా తోసే  నహి బోలు కన్హయ్య 'అనే పాట  లత,మన్నా డే ల చేత పాడించేరు


                 సి.రామచంద్ర సంగీత దర్సకత్వంలో` శారద' చిత్రంకోసం లత పాడిన` ఓ చాంద్ జహాన్ వొహ్ జాయే' ,హృదయనాథ్ మంగేష్కర్ స్వర రచనలో లత పాడిన `కరం కి గతి న్యారి'  కూడా  హంసధ్వని ఆధారం గా స్వరపరచిన మంచి పాటలు.
 సంత్.తులసీ దాస్ గణపతి ని స్తుతిస్తూ రచించిన ఒక భజన 'గాయియే గణపతి జగ్ వందన్ ( స్వరరచన :శ్రీ.వినుకొండ మురళి మోహన్ ,గానం :ధనంజయ్)
                       తెలుగు చలన చిత్రసంగీతంలో బహుళ ప్రజాదరణ పొందిన పాటలు `శ్రీ రఘురాం జయ రఘు రాం '(శాంతినివాసం చిత్రం కోసం ఘంటసాల సంగీత దర్సకత్వంలో పి.బి .శ్ర్రేనివాస్ పాడినపాట) ఈ పాటకి ముందర పాడే ఆది శంకరాచార్యుల వారి  శ్లోకం `శ్రీ రామ చంద్రహ ఆశ్రిత పారిజాతః .....'కూడా హంసధ్వని రాగమే. ,స్వాగతం సుస్వాగతం నృత్య గీతం ( శ్రీ కృష్ణ పాండవీయం చిత్రం కోసం టి.వి.రాజు స్వరపరచగా సుశీల పాడారు)`మనసు దోచే దొరవు నీవే !'( యశోదా కృష్ణ చిత్రం కోసం సాలూరు రాజేశ్వర రావు సంగీత దర్సకత్వంలో లో సుశీల పాడారు)`మౌనం  రాగం మధురం మధురం మధురాక్షరం ( మయూరి -సంగీతం- ఎస్ .పి.బాలు  -డ్యూయెట్  )`,మరుమల్లెలలో ఈ జగమంతా విరియగా '( అమృత -ఏ .ఆర్.రహ్మాన్ )`ఓ సారి నీ చెయ్యే తాకి '( ఈ అబ్బాయి చాలా మంచోడు-కీరవాణి-ఎస్.పి.బాలు,చిత్ర) తరలి రాదా తనే వసంతం తన దరికి రాని వనాల కోసం'(రుద్ర వీణ -ఇళయ రాజా-ఎస్.పి.బాలు)
                   శ్రీ రఘురాం జయరఘురాం ,తరలిరాద తనే వసంతం పాటలలో అన్య స్వరాల ని  ప్రయోగించడం వల్ల  ఈ పాటలు హంస్వధ్వని రాగం ఆధారంగా స్వరపరచబడిన పాటలుగా ఉదహరించడమే తప్ప సంపూర్ణంగా హంస్వధ్వని రాగంలో  లో స్వరపరచిన పాటలుగా చెప్పలేం.


 ఇటీవల వెలుగులోకి వచ్చిన 12  వ శతాబ్దపు వాగ్గేయకారుడు  శ్రీకాంత కృష్ణమాచార్యులు (క్రిష్ణమయ్య ) కీర్తన శ్రీ.వినుకొండ మురళి మోహన్ స్వరపరచిన` షోడస కళా పరిపూర్ణ నమో '

                                                                                                          `                                                                                                  మధురిమ' 

2 comments:

  1. దీక్షితార్ అడాప్ట్ చేసుకుని దక్షిణాది సంగీత సంప్రదాయానికి చెందిన ఇడియంస్ ,ఫ్రేజెస్ తో కీర్తనలని పాడారని చెపుతారు.
    "ఇడియంస్,ఫ్రేజెస్తో" ఇదేమిటో తెలీలేదు. అంటే మిగతా బోధపడిందని కాదు. అర్థం చేసుకొవడానికి ప్రయత్నిస్తుండే ఇలాంటి ఫ్రేజులు అడ్డం పడుతున్నాయి.
    సినీసంగీతం ఉదాహరించడం వలన సామాన్యుడికి భయంతగ్గి శాస్త్రీయ సంగీతంతో పరిచయం పెంచుకోవడానికి సాహసిస్తాడు ఇష్టం పెంచుకోగలడు. దీన్ని కొనసాగించండి. వెలుగు ప్రసరింపజేయండి.
    -కేవీ

    ReplyDelete